October 14, 2011

రుసుము కట్టకపోతే సదుపాయాలు కట్‌


రుసుము కట్టకపోతే సదుపాయాలు కట్‌
అపార్టుమెంట్లలో నివసించేవారు నెలసరి నిర్వహణ రుసుములు సక్రమంగా చెల్లించకపోతే.. వారి సదుపాయాలను నిలిపివేసే అధికారం సంఘానికి ఉంటుంది. కాకపోతే ఈ విషయం గురించి ఆయా గృహయజమానులకు ముందస్తు సమాచారాన్ని అందించాలి. అయితే ఎన్ని రోజులముందు నోటీసు ఇవ్వాలనే విషయాన్ని.. ఏ సంఘమైనా ఆరంభంలోనే తమ నియమ నిబంధనల్లో స్పష్టంగా రాసుకోవాలి.

అపార్టుమెంట్ల నిర్వహణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం.. ఆంధ్రప్రదేశ్‌ అపార్టుమెంట్స్‌ చట్టం 1997లో అమల్లోకి వచ్చింది. ఇందులోని మూడవ సెక్షన్‌ ఉమ్మడి నిర్వహణ ఖర్చు (కామన్‌ ఎక్స్‌పెన్సెస్‌) గురించి పలు అంశాల్ని స్పష్టంగా చెబుతోంది.
 అపార్టుమెంట్లలో నివసించేవారు మంచినీరు, విద్యుత్తు, భద్రత, లిఫ్టు, కామన్‌ ఏరియాల్లో పరిశుభ్రత.. ఇలా వివిధ అవసరాల నిమిత్తం నిర్వహణ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. అపార్టుమెంట్‌ నిర్వహణ, మరమ్మతులు, లిఫ్టు, జనరేటర్‌ వంటివి పాడైతే కొత్త వాటిని బిగింపజేయడం తదితర నిర్వహణ ఖర్చులో భాగమేనని గుర్తుంచుకోండి. అపార్టుమెంట్‌లో నివసించే వారి కోసం చేసే ప్రతి ఖర్చును అందులో నివసించేవారు భరించాల్సిందే! ఇదే విషయాన్ని అసోసియేషన్‌ సంఘాలూ తమ నియమ నిబంధనల్లో పేర్కొంటాయి.
 ఆంధ్రప్రదేశ్‌ అపార్ట్‌మెంట్స్‌ చట్టం సెక్షన్‌ 13, 20లు, ఛాప్టర్‌ 3లో ఒక భాగంగా ఉన్నాయి. సెక్షన్‌ 13 ప్రకారం.. ఉమ్మడి స్థలాల నిష్పత్తి, పొందుపరిచే సదుపాయాల్ని బట్టి నిర్వహణ ఖర్చును లెక్కించాల్సి ఉంటుంది. దీనిని ఫ్లాట్‌ యజమాని కట్టకపోతే సెక్షన్‌ 20 ప్రకారం సదరు ఫ్లాట్‌పై.. అసోసియేషన్‌కు అనుకూలంగా ఛార్జీ ఏర్పడుతుంది. కట్టకపోతే ఈ ఫ్లాట్‌ను అమ్మాలన్నా కుదరదు.
 ఈ చట్టంలో అపార్టుమెంట్‌ సంఘాలు అనుసరించాల్సిన నియమ నిబంధనలనూ పొందుపరిచారు. ఉమ్మడి నిర్వహణ కోసం సంఘం చేసే ప్రతి ఖర్చును ఫ్లాట్‌ యజమానులు భరించాల్సిందే! అయితే ఇవి ఛాప్టర్‌ 3లో పొందుపర్చడం వల్ల.. ఈ ప్రత్యేక చట్టబద్ధత లేకుండా పోయిందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
 సంఘం నియమ నిబంధనలనేవి సంఘం, దాని సభ్యుల మధ్య కుదిరిన అంగీకారమే! దీనిని సక్రమంగా పాటించని.. నిర్వహణ ఖర్చులను క్రమం తప్పకుండా చెల్లించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోక తప్పదు. కాకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై సంఘం నియమ నిబంధనల్లో రాతకోతలు స్పష్టంగా ఉండాలి. నిర్వహణ రుసుము సక్రమంగా చెల్లించని వారికి ఉమ్మడి సదుపాయాలను నిలిపివేయవచ్చు. ఈ పనికి ఉపక్రమించే ముందు ఆయా ఫ్లాట్‌ యజమానికి ఎన్ని రోజుల ముందు నోటీసులు జారీ చేయాలనే అంశం గురించి సంఘం నిబంధనల్లో ముందే రాసుకోవాలి. సంఘం మాటను పెడచెవిన పెడుతూ.. ఠంచనుగా నిర్వహణ రుసుములను చెల్లించని ఫ్లాట్‌ యజమానులను దారిలోకి తెచ్చుకోవాలంటే కొంత కఠినంగా వ్యవహరించక తప్పదు. ఒకవేళ సంఘం నియమ నిబంధనల్లో జరిమానా అంశం గురించి పేర్కొనకపోతే.. సంఘ సభ్యులు కలిసి నిబంధనలను సవరించి.. చర్యలు తీసుకోవచ్చు. సంఘం నిబంధనల్ని కఠినపరంగా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ, అట్టి నిబంధనలు చట్టానికి లోబడి ఉండాలి. ఉదాహరణకు విద్యుత్తు కనెక్షన్‌ను సంబంధిత విభాగపు సిబ్బంది ద్వారా తొలగించాలి తప్ప.. నేరుగా సంఘమే ఈ చర్యకు ఉపక్రమించకూడదు.
ఏదైనా ఒక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చి.. దానిని ప్రభుత్వంచే ఆమోదించబడిన చట్టబద్ధమైన అధికారి సమక్షంలో రిజిస్టర్‌ చేయించుకుంటేనే అపార్టుమెంట్ల చట్టం మూడో ఛాప్టర్‌ వర్తిస్తుంది. కానీ, మన వద్ద ఫ్లాట్‌ యజమానులు కానీ సంఘాలు కానీ ఈ పద్ధతిని పాటించరు. అందుకే ఈ చట్టం ఎక్కువగా అమలు కావట్లేదు.
ఇలా లెక్కించాలి!
* చిన్న అపార్టుమెంట్లలో ఫ్లాట్ల విస్తీర్ణంతో సంబంధం లేకుండా.. నిర్వహణ రుసుములను వసూలు చేస్తున్నారు. అయితే ఇదే విధంగా తీసుకోవాలన్న ప్రత్యేక నియమేం లేదు. అది సంఘం నియమ, నిబంధనలపై ఆధారపడుతుంది.
* గేటెడ్‌ కమ్యూనిటీ మెయింటనెన్స్‌ ఛార్జీల చెల్లింపుల గురించి ప్రత్యేకమైన నియమావళి అంటూ చట్టపరంగా ఏమీ లేదు. అయితే ఇందులో నివసించేవారు నిర్వహణ రుసుము కట్టట్లేదని.. వారిని ఖాళీ చేయమని చెప్పే అధికారం మాత్రం సంఘానికి ఉండదు.
ఇలా పెంచాలి!
* నెలవారి నిర్వహణ రుసుమును పెంచాలని అపార్టుమెంట్‌ సంఘం భావిస్తే.. ముందుగా సభ్యులందరికీ అధికారికంగా సమాచారాన్ని అందించాలి. సమావేశం తేదీనీ పేర్కొనాలి.
* సంఘం ఏర్పాటయ్యేటప్పుడు రాసుకున్న నియమ నిబంధనల (బైలాస్‌) ప్రకారం సంఘం తీసుకునే నిర్ణయాన్ని మెజార్టీ సభ్యులు ఆమోదించాలి. అయితే సంఘం ఒక నిర్ణయం తీసుకోవాలంటే.. దానికి ఎంతమంది మద్ధతు ఉండాలనే విషయం మీద సందేహాలు తలెత్తడం సహజమే! ఈ అంశం గురించి సంఘం ఏర్పాటైనప్పుడే నియమ నిబంధనల్లో స్పష్టంగా రాసుకోవాలి. దాని ప్రకారమే నిర్ణయం తీసుకోవాలి.
* సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఒకవేళ అత్యధిక సభ్యులు ఆమోదించకపోతే.. ప్రత్యేక సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. పాత నిర్ణయాన్ని రద్దు చేయమని సభ్యులు ప్రతిపాదించొచ్చు. దీనికి అత్యధిక సభ్యులు ఆమోదం తెలిపితే పాత నిర్ణయం రద్దవుతుంది.
- వెలగపూడి శ్రీనివాస్‌, న్యాయవాది
గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో.. ఫ్లాట్‌ విస్తీర్ణం చొప్పున (చదరపు అడుక్కీ) నెలవారీ నిర్వహణ రుసుమును లెక్కిస్తున్నారు. ఈ విధానం అధిక శాతం గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో అమలవుతోంది.

October 8, 2011

1-10-2011 నుండి కొత్త వాచ్ మెన్

మన అపార్ట్ మెంట్ కి కొత్త వాచ్ మెన్ ని 1-10-2011 నుండి నియమిచడమైనది. ఇతని పేరు సతీష్. ఫోను: 8105776599. 
ఇంతకు ముందు వాచ్ మెన్ గా పనిచేసిన సురేష్ అతని వ్యక్తిగత కారణాల వల్ల మానేస్తున్నానని చెప్పాడు. అతనికీ, మన అపార్ట్ మెంట్ కీ ఇకపై సంబంధం లేదని ప్రకటిస్తున్నాం.... సాయి క్లస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్

September 1, 2011

అపార్ట్ మెంట్ లో వినాయక చవితి ఉత్సవాలు

సాయిక్లస్టర్ అపార్ట్ మెంట్ లో వినాయక చవితి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు, దంపతుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి.